తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా యూరియా సరఫరా, పామాయిల్‌కు కనీస మద్దతు ధర (మినిమం గ్యారంటీ ధర), వ్యవసాయ రంగ సంస్థలకు సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించిన పలు సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. దేశంలోనే పామాయిల్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చౌహాన్ అభినందించారు. తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.



