తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అత్యవసర బృందాలను సిద్ధం చేశారు.
రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. గత వర్షాలతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం సంభవించినట్లు సమాచారం. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.


