పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవంటున్న గ్రామస్థులు
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
రాంబిల్లి: మండలంలోని జిరాయితి చింతువా వెంకయ్యపాలెం తీర ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఇసుక అక్రమ తరలింపుపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో సహజ స్వరూపం దెబ్బతినడంతో పాటు పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించకపోవడంతో అక్రమ ఇసుక రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి తీర ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, తరలింపులపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.


