భద్రాద్రి కొత్తగూడెం: రామవరం 16వ డివిజన్‌లో మిషన్ భగీరథ పనుల పేరుతో రోడ్లను ఇష్టారీతిన తవ్వి, మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్విన గుంతలను సకాలంలో పూడ్చకపోవడంతో వాహనదారులకు ప్రమాదాల ముప్పు పొంచి ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు గుంతల్లో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ టాకీస్, బర్మా క్యాంపు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్యాచ్‌వర్క్ చేసినప్పటికీ, అక్కడక్కడా పనులు అసంపూర్తిగా వదిలేయడంతో రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రోడ్లపై గుంతలు, ప్యాచ్‌వర్క్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డివిజన్‌లోని రోడ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని 16వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు సాయిరాజ్ డిమాండ్ చేశారు.



