కాకినాడ , కిర్లంపూడి,జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 7:
జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఉలిసి అయిరాజు కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో గోనెడ గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అయిరాజుకు ఘనంగా సన్మానం చేశారు. గోనెడ గ్రామం మొత్తం జనసేన జెండాలు, నినాదాలతో కోలాహలంగా మారింది.పార్టీని నమ్ముకుని, జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేసిన సామాన్య కార్యకర్తకు అరుదైన గౌరవం దక్కిందని పలువురు రాజకీయ నేతలు అభినందించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తికి కేంద్ర కార్యాలయం నుంచి ఇంతటి పెద్ద బాధ్యత ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు.కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలను గుర్తించి బాధ్యతలు అప్పగించడం జనసేనలోనే సాధ్యమని, ఇది పవన్ కళ్యాణ్ నాయకత్వ ప్రత్యేకతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.రాబోయే మున్సిపాలిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ జనసేన తరఫున యువత పెద్ద ఎత్తున పోటీ చేసి వంద శాతం విజయం సాధించేలా కమిటీ కృషి చేయాలని పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కాన్ఫరెన్స్ కాల్ లో దిశానిర్దేశం చేశారని అయిరాజు తెలిపారు.తనపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తానని, తనకు ఈ గౌరవం, గుర్తింపు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు, జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి, తన 12 ఏళ్ల ప్రయాణంలో తోడుగా నిలిచిన నియోజకవర్గ, మండల, గ్రామ జనసైనికులకు ధన్యవాదాలు తెలిపారు.


