రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ పకడ్బందీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు.
బుధవారం, మార్కాపురం జిల్లాలోని కనిగిరి లోని అంగన్వాడీ కేంద్రాలను, హాస్టల్ లు, పాఠశాలలను ఆకస్మికంగా తనికి చేశారు, అనంతరం ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలంలోని గార్లపేట ఎస్సీ కాలనీ, ఓసీ కాలనీ, వేమవరం, మర్రిపూడి ఎస్సీ కాలనీలలోని అంగన్వాడీ కేంద్రాలను, గార్లపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, చౌక ధరల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా కూచిపూడి హైస్కూల్‌ను ఆయన సందర్శించిన సమయంలో, అక్కడ మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన చైర్మన్, స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
విద్యార్థులు కూడా ఆహారం బాగుండటం లేదని చెప్పడంతో తీవ్రంగా పరిగణించిన ఆయన, వెంటనే మర్రిపూడి మండల తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై త్రిమెన్ కమిటీ ద్వారా తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులైన వంట సిబ్బందిని తొలగించి నూతన వంట వర్గాన్ని నియమించాలని స్పష్టం చేశారు.
అనంతరం కూచిపూడిలోని చౌక ధరల దుకాణాన్ని, రావెళ్లవారిపాలెంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) కూడా ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల సందర్భంగా వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో అధికారులు, సిబ్బంది చేపట్టాల్సిన తనిఖీల వివరాలను చైర్మన్ సుదీర్ఘంగా వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహార నాణ్యతను ముఖ్యంగా పరిశీలించాలని సూచించారు. అక్కడ బియ్యం, పప్పులు, గుడ్లు, పాలు, బాలామృతం నిల్వల నమోదు పక్కాగా ఉండాలని, గడువు ముగిసిన సరుకులు లేకుండా చూడడంతో పాటు పిల్లల బరువు, ఎత్తు కొలిచే పరికరాల పనితీరు, కేంద్రాల పరిశుభ్రత మరియు తాగునీటి సదుపాయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు.
అదేవిధంగా చౌక ధరల దుకాణాల్లో ఈ-పోస్ (e-Pos) యంత్రాల పనితీరును, ఎలక్ట్రానిక్ తారాజుల ప్రామాణికతను నిరంతరం పరిశీలించాలని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత, బస్తాల బరువు, నిల్వల రికార్డులు మరియు కార్డుదారుల బయోమెట్రిక్ వివరాలను సరిచూసుకోవాలని, కార్డుదారులకు ఎటువంటి అవకతవకలు లేకుండా రాయితీ బియ్యం అందేలా చూడాలని ఆదేశించారు.
మరోవైపు పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో రోజువారీ మెనూ ప్రకారం వేడివేడి నాణ్యమైన భోజనం అందించాలని, వంటశాలల పరిశుభ్రతతో పాటు వంటకు ఉపయోగించే నూనె, పప్పులు, ఐయోడైజ్డ్ ఉప్పు వంటి సరుకులు ఏజీమార్క్ నాణ్యత కలిగి ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
విద్యార్థులకు వడ్డించే ముందు ఉపాధ్యాయులు భోజనాన్ని రుచి చూసే ప్రక్రియతో పాటు వంట సిబ్బంది పరిశుభ్రతా నియమాలు పాటిస్తున్నారా లేదా అనేది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. KGBV మరియు ఇతర సంక్షేమ వసతిగృహాల్లో అల్పాహారం, భోజన నాణ్యత, స్టాక్ రిజిస్టర్లు, డైనింగ్ హాల్స్ మరియు మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని చైర్మన్ తెలిపారు. ఈ పథకాల ఫలాలు విద్యార్థులకు నేరుగా అందాలని, ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి, సాధారణ విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం పెంచుకుని ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు.
• వేమవరం అంగన్వాడీ కేంద్రం లో ఇండక్షన్ స్టవ్ ,మెటీరియల్ పెట్టుకోవటానికి టేబుల్ ఏర్పాటు కోసం సొంత నగదు 2 వేల రూపాయలు అంగన్వాడీ టీచర్ కి అందించారు.
•రావెళ్ళవారిపాలెం కేజీబీవీ లో పదవ తరగతిలో 577 మార్కులు సాధించిన విద్యార్థికి 2 వేల రూపాయలు ఇచ్చి మంచి చేతి గడియారం కొనిపించాలన్నారు.
Uploaded Video:


