మధిర, జూలై
: జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా మధిర అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, నిరుద్యోగం పెరిగిందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 20 శాతం కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలోని మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గంపై ప్రత్యేకంగా స్పందిస్తూ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రోడ్లు, మౌలిక వసతులు, రైతాంగ సమస్యలు సహా అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందాల్సిన మధిర వెనుకబడిందని విమర్శించారు.
జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి, రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సత్తుపల్లి ఇంచార్జి బండి నరేష్, రాష్ట్ర నాయకులు రాము యాదవ్, మధిర నియోజకవర్గ నాయకులు అనుముల నరేష్, జొన్నలగడ్డ భద్ర, వీర మహిళ నాయకురాలు తోట దీపకాల, వార్డ్ సభ్యురాలు పున్నం రోజా, సజ్జనపు శ్రీనివాసరావు, పగడాల పవన్, మిట్టపల్లి రామారావు, జిల్లా నాయకులు బండారు రామకృష్ణ, ఉత్తమ్ రాజ్, బానోత్ దేవేందర్, కార్తీక్, రమణ కుమార్, శ్రవంత్ కన్నా, మణికంఠ, కళ్యాణ్, రాకేష్ చారి, విజయ్, పిల్లి రాజేష్, సాయి, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



