రంగంపేట, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రంగంపేట మండలం వడిశలేరు సూర్యనారాయణపురంలో నిర్వహించిన “వడిశలేరు చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం”లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 26 మంది చేనేత కార్మికులకు రూ.3.72 లక్షల విలువైన హెచ్ఎస్ఎస్ (HSS) చేనేత పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ఈ పథకంలో పరికరాల వ్యయంలో 90 శాతం సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుల వాటాగా ఉంటుందని తెలిపారు. చేనేత కార్మికులకు ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
పులగుర్త, పందలపాక, పెదపూడి, ఎస్టీ రాజాపురం ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పులగుర్తలో తయారయ్యే మలక చీరలు, ఇతర చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.
అనపర్తి చేనేత రంగాన్ని యునెస్కోతో అనుసంధానం చేసే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి సంబంధిత సంస్థలతో సమన్వయం చేసే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత శాఖ అధికారులు, రంగంపేట మండలం కూటమి నాయకులు, చేనేత కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



