పున్నమి గూడూరు ఆగస్టు 12
ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రముఖ గ్రంథాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాల వంటివని, విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు. కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ యశోద మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని, కళ్లకు కూడా మంచి వ్యాయామంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాల గ్రంథపాలకుడు డాక్టర్ విజయ మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, తద్వారా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



