తూర్రాపు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15 రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరం నగరంలో పారిశుధ్య నిర్వహణను పటిష్టం చేయాలని, అందుకు తగిన సంఖ్యలో మున్సిపల్ కార్మికులను ఇప్పటి నుంచే పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈరోజు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి కార్మికుల సమస్యలు, పుష్కరాల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు రాజమహేంద్రవరానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున నగరంలో పారిశుధ్య నిర్వహణకు భారీగా అదనపు సిబ్బంది అవసరమవుతుందని తెలిపారు. పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి సిబ్బందిని హడావుడిగా సమకూర్చడం కాకుండా ఇప్పటి నుంచే అవసరమైన సిబ్బంది సంఖ్యను గుర్తించి నియామకాలు చేపట్టాలని కోరారు.
మున్సిపల్ కార్మికులు ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం, నగర పరిశుభ్రత కోసం అత్యంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారికి సరైన వేతనాలు, రక్షణ సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే పని చేస్తున్న కార్మికుల మధ్య వేతనాల్లో వ్యత్యాసాలు ఉండటం అన్యాయమని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలు, పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కార్మికుల వేతనాలను పెంచాలని కోరారు.
అదేవిధంగా కార్మికులకు నాణ్యమైన పనిముట్లు, గ్లౌజులు, మాస్కులు, బూట్లు, ఇతర రక్షణ పరికరాలను తక్షణమే అందించాలని కోరారు. సరైన పరికరాలు లేకుండా కార్మికులతో ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయించడం సరికాదన్నారు.
కమిషనర్ దృష్టికి ప్రధాన డిమాండ్లు
* గోదావరి పుష్కరాల నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బందిని గణనీయంగా పెంచాలి
* సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
* మున్సిపల్ కార్మికుల వేతనాలను పెంచాలి
* కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు వెంటనే అందించాలి
* పెరుగుతున్న పని భారానికి అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించాలి
* పుష్కరాల కోసం ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
* కార్మికులకు భద్రత, ఆరోగ్యం, సంక్షేమానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలి
“గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు పరిశుభ్రమైన వాతావరణంలో, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పుణ్యస్నానం చేసి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. అందుకు మున్సిపల్ కార్మికులే కీలకం. కాబట్టి వారి సమస్యలను పరిష్కరించి, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత” అని తాటిపాక మధు అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరావు, కోశాధికారి రెడ్డి రమణ,జిల్లా నాయకులు బంగారు గిరి, గుడుపు గిరి సిటీ కార్యదర్శి కాకి శారద, పి పోలమ్మ, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు



