ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ నేడు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అర్ధరాత్రి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలీసుల చర్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసు అరెస్టులకు భయపడేది లేదని, విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదలయ్యే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.




