ఖమ్మం జిల్లాకు క్రీడా రంగంలో మహర్దశ పట్టనుంది. రూ.92.76 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రఘునాథపాలెం మండలంలో 21.20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఫ్లడ్‌లైట్లతో కూడిన క్రికెట్ స్టేడియం, ఇండోర్ గేమ్స్ హాల్స్, స్విమ్మింగ్ పూల్‌తో పాటు పలు ఆధునిక క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిట శ్రీహరి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే ఖమ్మం ప్రముఖ క్రీడా కేంద్రంగా అవతరించే అవకాశముంది.


