రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్‌పై న్యాయమూర్తి క్షేత్రస్థాయి పరిశీలన
సెప్టెంబర్ 5న ఆధారాలు అధికారుల చర్యల నివేదికలు సమర్పించాలని ఆదేశం
మాజీ ఏజీపీ బాధితుల తరఫున న్యాయవాది గొడుగుల మహేంద్ర మరియు ఒబ్బిన సన్యాసిరావు ఆధ్వర్యంలో న్యాయమూర్తికి స్వాగతం
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 01.( ప్రజా ప్రతిభ )
కొత్తవలస మండలం రాజన్న కాలనీ సమీపంలో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య, ఆరోగ్య సమస్యలపై కొత్తవలస మండల న్యాయ సేవా కమిటీ ఛైర్మన్, న్యాయమూర్తి డాక్టర్ విజయచందర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
రాజన్న కాలనీ వద్ద డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన నిరసన కార్యక్రమం వద్దకు న్యాయమూర్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో, మాజీ ఏజీపీ గొడుగుల మహేంద్ర అధ్యక్షతన న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి డాక్టర్ విజయచందర్, ఏజీపీ గిరిబాబు బాధిత గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం డంపింగ్ యార్డ్ ప్రాంగణాన్ని న్యాయమూర్తి స్వయంగా పరిశీలించారు. అక్కడ పేరుకుపోయిన చెత్త, పారిశుధ్య పరిస్థితులు, కాలుష్య సమస్యలను పరిశీలించి సంబంధిత అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
డంపింగ్ యార్డ్ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోందని ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలతో సెప్టెంబర్ 5న జరిగే విచారణకు హాజరుకావాలని ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది గొడుగుల మహేంద్రను న్యాయమూర్తి సూచించారు. అలాగే డంపింగ్ యార్డ్ తరలింపునకు సంబంధించి ఇప్పటివరకు అధికారులు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సెప్టెంబర్ 5లోగా సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ) గిరిబాబును ఆదేశించినట్లు తెలిపారు.
ఈ సమస్యపై తదుపరి విచారణలో వెలువడే నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యకు పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి రాజన్న కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తవలస బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, గ్రామ రామాంజనేయ యువజన సంఘం అధ్యక్షులు మొగ్గ ప్రశాంత్, శ్రీను, గోపి, వెంకటేష్, ఎవర్ని దేవి, బుసల జ్యోతి తదితరులతో పాటు రాజన్న కాలనీకి చెందిన 100 మందికి పైగా గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.


