ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సభాభవనంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాలో విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన పలువురు ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు.ఇందులో భాగంగా ఒంటిమిట్ట మండలం కొండమాచుపల్లిలోని SNYS సంస్కృతం హైస్కూల్ హెచ్‌ఎం మామిళ్ళ వెంకటేశ్వర్లను జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. జేసీ నిధిమీనా, డీఆర్వో మల్లికార్జునుడు, డీఈవో షంషుద్దీన్, జిల్లా సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త అనురాధ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానుప్రకాష్ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సమగ్ర వికాసానికి చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకోవడం పట్ల హెచ్‌ఎంకు సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.


