ఖమ్మం, మే
పున్నమి జిల్లా ప్రతి నిధి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపురాజు రామచంద్రరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో సమగ్ర విచారణ జరపకుండా కేవలం పరిమిత అంశాలనే సీబీఐకి అప్పగించడం కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలకు నిదర్శనమని ఆయన అన్నారు. అసలు బాధ్యులను కాపాడేందుకే ప్రభుత్వం తూతూమంత్రంగా విచారణ సాగిస్తోందని ఆరోపించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం, తేమ శాతం పేరుతో అక్రమ తరుగు, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేసి, ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో సుమారు రూ.10 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. పన్నుల వాటా, కేంద్ర పథకాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు.
జాతీయ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని పేర్కొన్న రామచంద్రరావు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశ భద్రత, అభివృద్ధి, రాజ్యాంగ పరిరక్షణలో బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన, ఖమ్మం జిల్లాలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్ర సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పుల్లారావు యాదవ్, గల్లా సత్యనారాయణ, వినోద్ రావు,గేంటెల విద్యా సాగర్, నున్న రవి కుమార్, మంద సరస్వతి, తదితరులు పాల్గొన్నారు



