కరప్షన్ రాజా..?
లేదా కోట్ల అక్రమాల కింగ్‌పినా..?
హైదరాబాద్‌లో భారీగా వెలుగుచూసిన అవినీతి వ్యవహారం
పున్నమి న్యూస్
09జూన్ 2026
హైదరాబాద్ డివిజన్
హైదరాబాద్ లోని ఓ అండ్ బీ ఇంజినీర్-ఇన్-చీఫ్ నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
దాడుల సమయంలో ఇంట్లో రూ.200 కోట్లకు పైగా ఆస్తుల వివరాలు, రూ.60 లక్షల నగదు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ఖరీదైన భూముల పత్రాలు, ఫ్లాట్ల డాక్యుమెంట్లు, బ్యాంక్ లాకర్ వివరాలు బయటపడినట్లు సమాచారం. ఈ ఘటన ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంతగా పెరిగిందో మరోసారి బయటపెట్టిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా మరిన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ప్రజల సొమ్మును దోచుకుని విలాసవంతమైన జీవితం గడిపే అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “సంపాదించేది జీతమా…? లేక కోట్ల అక్రమ సంపదా…?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏసీబీ దాడుల్లో బయటపడ్డ కోట్ల అక్రమాస్తులు
బంగారం, నగదు, భూముల పత్రాలు స్వాధీనం
అవినీతిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
ఇంకా పెరిగే అవకాశం ఉన్న అక్రమాస్తుల విలువ



