తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 22:
తాళ్లపూడి మండల పరిధిలో నిర్వహణలో ఉన్న ఓపెన్ ఇసుక రీచ్‌ల అనుమతులు మే 21తో ముగియడంతో ర్యాంపులలో ఇసుక తవ్వకాలను నిలిపివేసినట్లు ఏపీ మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఫణి భూషణ్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం ఓపెన్ రీచ్ యాజమాన్యాలు ఇప్పటికే నిల్వ ఉంచిన ఇసుకను మాత్రమే విక్రయించాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు ముగిసిన అనంతరం రీచ్‌లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహించినా, బిల్లులు లేకుండా ఇసుక రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక రాబోయే వర్షాకాల పరిస్థితులు, వరద ప్రవాహాలను దృష్టిలో ఉంచుకుని బోట్మెన్ సొసైటీ ఆధ్వర్యంలోని ర్యాంపులు ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడతాయని తెలిపారు. ఇసుక రవాణా, విక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.



