ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు
పున్నమి ప్రతినిధి | సెప్టెంబర్ 15, 2026 | కడప
కడప నగరంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిందేనని కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ స్పష్టం చేశారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజల ఓటు హక్కును దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షులు వాసు, వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా మధ్య ఏకగ్రీవాలపై జరుగుతున్న సవాళ్లను ప్రస్తావించారు. ఎన్నికలు ఏకగ్రీవాల కోసం కాదని, ప్రజలు తమ ఓటు హక్కుతో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకేనని అన్నారు.
కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ప్రజల ఓటు హక్కును కాలరాసే విధంగా ఏకగ్రీవాలు చేసుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రజల ద్వారా, ఓటు ద్వారా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరగాలని, ప్రజలకు తమ నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలని అన్నారు.
అవసరమైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని గౌస్ పీర్ తెలిపారు.
కడప మేయర్ కాంగ్రెస్‌దే
కడప నగర మేయర్ పదవిపై కూడా గౌస్ పీర్ ధీమా వ్యక్తం చేశారు. 66 డివిజన్లలో 35 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుందని, ప్రజల తీర్పుతో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని సాధిస్తుందని ఆయన అన్నారు.
మిగిలిన 31 డివిజన్లలో టీడీపీ, వైసీపీలు ఎవరు ఎంత గెలుస్తారో వారు చూసుకోవాలని, అయితే ప్రజల ఓటుతో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి స్పష్టమైన మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏకగ్రీవాల పేరుతో ప్రజలకు ఎన్నికల హక్కును దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని గౌస్ పీర్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
కడప ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని, తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే అవకాశం పొందే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని గౌస్ పీర్ తెలిపారు.
ఈ సమావేశంలో నగర ఉపాధ్యక్షులు సౌదాగర్ సాదిక్, ఫజరుల్లా, యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్ధిక్, డివిజన్ ఇన్‌చార్జిలు షేక్ అన్వర్, మహబూబ్ బాషా, సయ్యద్ అన్వర్, గఫార్, హాజీ, మురాద్ భాష, సుబ్రహ్మణ్యం తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





