సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి
ఉచిత నిర్భంద విద్యకు కేంద్ర ప్రభుత్వ విధానాలు తూట్లు పొడుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు.
ఈ మేరకు ఈశ్వరయ్య శనివారం తెలియ చేశారు. భారత రాజ్యాంగ ప్రకారం విద్య మొట్టమొదటగా రాష్ట్ర జాబితాలో ఉండేది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. దీని ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై చట్టాలు చేయగలిగే పరిస్థితి వచ్చింది. ఈ అధికారాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 1986 ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం ప్రాథమిక విద్యతోపాటు ఉన్నత సాంకేతిక విద్యకు ఊహించనంత ఊతం ఇచ్చింది. ఈ సాంకేతిక విద్య వలననే యువత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలను ఇన్‌కమ్ టాక్స్ రూపంలో చెల్లిస్తున్నారు.
జాతీయ విద్యా విధానం 1986 తరువాత ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థలకు (టెక్) దిగ్గజాలుగా నాయకత్వం వహిస్తున్న భారతీయ విద్యార్థులు మేధస్సుకు, జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత విద్యాసంస్థల ప్రవేశాలకు నిర్వహించే పోటీ పరీక్షలలోను, వివిధ ఉద్యోగాల కొరకు నిర్వహించే పరీక్షలలోను, 25-30 శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంబంధించిన విద్యార్థులే ఉండటానికి ప్రధాన కారణం పాఠశాల స్థాయిలోను, ఉన్నత విద్యా స్థాయిలోను నాణ్యమైన పాఠ్య ప్రణాళికతోపాటు అంకిత భావం గల ఉపాధ్యాయులే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
2014 తరువాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం బట్టీ విధానాలకు స్వస్తి పలకాలనీ, శాస్తీయ విద్యా విధానంలోనే బోధన చేయాలని, విద్యార్ధికి కేంద్రీకృతంగా కృత్యాధాధార బోధననే ప్రధానం అంటూ పదే పదే ప్రభుత్వాలు చిలక పలుకులు పలకడం నిజమేనని ఉపాధ్యాయులు భావించారు. గణితంలో ఎక్కాలు, సూత్రాలు బట్టీ కొట్టకుంటే గణితానికి అర్థం ఉంటుందా. కానీ 2020 పుణ్యామా అని ఎన్‌సిఈఆర్‌టి/ఎస్‌సిఈఆర్‌టి కొత్తగా మార్చిన పాఠ్య పుస్తకాలలోని విషయం పరిజ్ఞాన్నాన్ని పరిశీలిస్తే అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కానిదనీ, ఈ పాఠ్య పుస్తకాలలోని విషయ పరిజ్ఞానంతో గుమాస్తాలను కూడా తయారు చేయలేమని, మరీ ముఖ్యంగా గణిత పాఠ్య పుస్తకాలలో విషయ పరిజ్ఞానం గణిత ఉపాధ్యాయులను సహితం విస్మయం కలిగిస్తుంది. అంతేగాక నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రభుత్వ ప్రాథమిక విద్యా విధానాన్ని 20 సంవత్సరాలు వెనక్కు నెట్టిందని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేయడమే ప్రధాన ఉద్దేశం అని ఎన్‌సిఈఆర్‌టి/ఎస్‌సిఈఆర్‌టి కొత్తగా మార్చిన పాఠ్య పుస్తకాలలోని విషయం పరిజ్ఞానాన్ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.
ప్రైవేట్, కార్పొరేటు విద్యా సంస్థలు మాత్రం ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలను ఏ మాత్రం వాడకుండా, నిబంధనలు విరుద్ధంగా ప్రముఖ గణిత రచయితలైన ఆర్.డి. శర్మ , ఆర్.ఎస్. అగర్వాల్, చాంద్ పబ్లికేషన్‌లచే తయారు చెయ్యబడిన నాణ్యమైన పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రాంగణాల్లోనే అమ్మడాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పర్యవేక్ష అధికారుల తీరు ఒకవైపు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులపైనా వివక్ష మరొకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని అఘాతంలోకి నెట్టేస్తూ కార్పొరేటు విద్యాసంస్థకు రెడ్ కార్పెట్లు పరుస్తున్న వైనం బలహీన వర్గాల బడిపిల్లకు శాపం అవుతుందనడంలో సందేహం లేదు.
పాఠశాల పనివేళ్లలోనే కర్మయోగి సామాజిక మాధ్యమం ద్వారా శిక్షణలు, యోగ దినోత్సవం, తల్లిదండ్రుల సమావేశాలు లాంటి గిన్నిస్ ఈవెంట్లు, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ ఆధారిత పనులు వంటి బోధనేతర పనులను సహితం పాఠశాల పనివేళల్లో వద్దంటూ మొత్తుకున్నప్పటికీ ప్రభుత్వాలు చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహరిస్తున్నాయి.
పరీక్ష విధానాల్లో సంస్కరణలంటూ పాఠశాల స్థాయిలో జరగవలసిన యూనిట్ పరీక్షలలో సైతం కేంద్రస్థాయిలో తయారు చేసిన ప్రశ్నపత్రం ప్రవేశపెట్టడం, వచ్చిన మార్కులను ఆన్లైన్ చేయమంటూ ప్రైవేటు పాఠశాలలకు సాఫ్ట్వేర్ తయారు చేయించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో గత 12 సంవత్సరాలుగా 95 ప్రతిష్టాత్మక ప్రశ్నపత్రాలు లీకులు చేయడం అత్యంత దుర్మార్గం.
పాఠశాల్లో అడ్మిషన్లు ప్రారంభ నెల జూన్లో ఉపాధ్యాయులకు వివిధ రకాల శిక్షణలు, బదిలీలు, పదోన్నతులు వంటి కార్యక్రమాల పేరిట పాఠశాలకు దూరం చేయడం, అదే సమయంలో ప్రైవేట్, కార్పోరేటు విద్యా సంస్థలకు అడ్మిషన్లకు గేట్లు ఎత్తడం జరుగుతోంది. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ సెలవులను 60 నుండి 180 రోజులకు పెంచడం హర్షణీయమే కానీ వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమించక పోవడాన్ని చూస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలపై ప్రభుత్వాలకు ఏమాత్రం ప్రేమ ఉందో అర్ధమవుతోంది.
విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఇందులో సెక్షన్ 23 (1) నందు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన, అకాడమిక్ సంస్థ నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్న ఏ వ్యక్తయినా ఉపాధ్యాయునిగా నియమింపబడటానికి అర్హులనే నిబంధనలను అనుసరించి 2011 నుండి కొత్తగా నియమించబడే ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టిఈటి) నిర్వహించి, తదుపరి డిఎస్‌సి పరీక్షలో మెరిట్ వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. ఒక మైనారిటి విద్యాసంస్థలో ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన కేసులో భారత ఉన్నత న్యాయస్థానం 2011కు ముందు నియమించబడిన సీనియర్ ఉపాధ్యాయులు సహితం టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టిఈటి) 3 సంవత్సరాలలో తప్పక పాస్ కావాలని లేదా ఉద్యోగాన్ని వదులుకోవాలనే నిబంధన విధించడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గత 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాల సంఖ్య, అందులో చదువుకొనే విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. అదే స్థాయిలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య, అందులో చదువుకొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే కారణం. 14 ఏళ్లలోపు బాల, బాలికలకు ఉచిత నిర్భంద విద్యను అందించాలనే లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సమగ్ర విద్య, విజ్ఞానంతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి, ఉచిత నిర్భంద విద్యను సక్రమంగా అమలుచేయాలని పాలకులకు హితవు పలుకుతున్నాం. అని పిలుపునిచ్చారు


