అధిక లోడ్‌తో దూసుకెళ్తున్న లారీలు.. గాలికి ఎగిరే ఇసుకతో వాహనదారులకు ముప్పు
ఆత్మకూరు, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై అధిక లోడ్‌తో ఇసుకను తరలిస్తున్న లారీల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగం–వాసిలి ప్రాంతం మీదుగా వెళ్తున్న ఇసుక లారీల నుంచి ఇసుక రోడ్డుపై పడటంతో పాటు గాలికి ఎగిరి వెనుక ప్రయాణించే ద్విచక్ర వాహనదారుల కళ్లలో పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కళ్లలో పడటంతో క్షణకాలం రహదారి కనిపించక వాహన నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు ఇసుక లారీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. అధిక లోడ్‌తో ఇసుక తరలించే వాహనాలను తనిఖీ చేయడంతో పాటు, ఇసుక రోడ్డుపై పడకుండా, గాలికి ఎగిరిపోకుండా లారీలను పూర్తిగా కప్పి తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారిపై ఇసుక పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వాహనదారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేకించి రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యలు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించాలి.


