పల్నాడు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో ఇంటి బయట నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మానుయేలు (35)పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇమ్మానుయేలు ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు తదితర కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ దారుణ ఘటనతో ఓబులేసునిపల్లెలో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

