ఖమ్మం: జిల్లాలో ఆహార వ్యాపారం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ FSSAI లైసెన్స్, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ. శరత్ సూచించారు. శనివారం ఖమ్మం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక ఆహార లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, ఇతర ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు FSSAI నిబంధనలు పాటించడం ఎంతో ముఖ్యమన్నారు. వ్యాపారులు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు అవసరమైన వివరాలతో మేళాకు హాజరై ప్రక్రియను పూర్తి చేసుకోవాలని శరత్ సూచించారు. ఆహార భద్రత ప్రమాణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.



