ఆలయం కూల్చివేతపై విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు
గ్రామస్థుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన
పున్నమి న్యూస్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
కొంగరకాలన్, మే 21
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కొంగర కలాన్ 54వ డివిజన్ చింతపల్లి గూడ గ్రామంలో ఉన్న పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని అక్రమంగా కూల్చివేశారంటూ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామ ప్రజలు ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి గూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 9, 10, 11, 12లో గాజులబోడు ప్రాంతంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉండేదని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు.
అయితే ఇటీవల ఆ ప్రాంతంలో “ప్రగతి టౌన్ షిప్” పేరుతో వెంచర్ ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు ఆలయాన్ని అక్రమంగా తొలగించారని గ్రామస్థులు ఆరోపించారు. తమ ఆరాధ్య దైవంగా భావించే ఆలయాన్ని కూల్చివేయడం వల్ల గ్రామ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ మహేందర్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ సూర్య తేజ్ గ్రామస్థులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఆలయం కూల్చివేతకు సంబంధించిన అంశాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక (డీసీవీ) రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు ఉడుతల రవి గౌడ్, కొండ్రు రాములు, జోగు బాలయ్య, జోగు నర్సింహ, శేరి జంగయ్య, జోగు భిక్షపతి, జోగు ఇబ్రహీం, జోగు పెంటయ్య, జోగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



