*ఆత్మకూరు*:
నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 17, 18, 20 వార్డుల్లో గత నాలుగు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక మహిళలు ఆదివారం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంగణం వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
*క్యాన్ వాటర్‌కే దిక్కు*:
కనీస అవసరాలకు సైతం నీరు లేకపోవడంతో ఒక క్యాన్ వాటర్ 15 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. “నాలుగు రోజుల నుంచి ఒక్క చుక్క నీరు రావడం లేదు. బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, తాగడం అన్నిటికీ డబ్బు పెట్టి క్యాన్ వాటర్ కొంటున్నాం” అని స్థానిక మహిళలు వాపోయారు.
*సీపీఎం నాయకుల ఆగ్రహం*:
ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ సీపీఎం నాయకులు డేవిడ్ రాజ్ మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు తాగునీటి కోసం రోజూ డబ్బు చెల్లించి క్యాన్ వాటర్ కొనే పరిస్థితిలో లేరన్నారు. “ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం” అని ఆయన హెచ్చరించారు.
*అధికారులకు విజ్ఞప్తి*:
తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు తమపై దయవుంచి వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలని మహిళలు కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
*కార్యక్రమంలో*:
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు డేవిడ్ రాజ్‌తో పాటు 15, 16, 17, 18, 20 వార్డులకు చెందిన పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


