కోదాడ,/ ఖమ్మం
అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే కేకేసి (KKC) ప్రధాన లక్ష్యమని KKC జాతీయ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు డా. ఉదిత్ రాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనకు KKC ఖమ్మం జిల్లా, కోదాడ కమిటీల ఆధ్వర్యంలో కోదాడ నేషనల్ హైవే వద్ద ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా KKC నాయకులు, కార్మిక ప్రతినిధులు డా. ఉదిత్ రాజ్‌ను కలిసి ఆటో కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్, బిల్డింగ్ కార్మికులు, హమాలీలు తదితర అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తక్కువ ఆదాయం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య భద్రత, పెన్షన్, ప్రమాద బీమా వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఈ సందర్భంగా డా. ఉదిత్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అసంఘటిత కార్మికుల సమస్యలను ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు గౌరవం, భద్రత, సామాజిక న్యాయం, సంక్షేమం అందే వరకు KKC పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో KKC ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గయాజ్ పాషా, పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు డి. మార్ట్ జానీ, ఖమ్మం త్రీ టౌన్ అధ్యక్షులు సిహెచ్. రాజు, శ్రీను, కోదాడ అధ్యక్షులు జలంధర్ పాల్గొన్నారు.



