పార్టీ సీనియర్ నేత సిద్ధు తీవ్ర అభ్యంతరం.
కావలి జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. వైసీపీ సీనియర్ నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి జనసేన పార్టీలో చేరడంపై ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిన పార్టీ సైనికులకు విలువ లేకుండా, గతంలో తమపై కేసులు పెట్టి, అరాచకాలు, భూదందాలకు పాల్పడ్డారని తాము ఆరోపిస్తున్న వ్యక్తులను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఎవరిపై పోరాటం చేశామో.. ఇప్పుడు వారినే పార్టీలోకి ఆహ్వానిస్తే కావలి ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు.
గత ప్రభుత్వ హయాంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని తాము ఆరోపిస్తున్న వ్యక్తులకు జనసేనలో చోటు కల్పించడాన్ని తాము సమర్థించబోమని సిద్ధు స్పష్టం చేశారు.
జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిగా, పార్టీ సైనికుడిగా పనిచేసిన తమకు పార్టీలో విలువ లేదా? తమకంటూ నిర్ణయం, నాయకత్వం ఉండదా? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు, భూ దందాలకు పాల్పడ్డారని తాము ఆరోపిస్తున్న వ్యక్తులకు తాము జై కొట్టేది లేదన్నారు.
భూ దందాలపై ప్రభుత్వ విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో.. వాటిని తప్పించుకునేందుకే జనసేనలో చేరారనే అనుమానాన్ని సిద్ధు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల స్పందన తెలియాల్సి ఉంది.
రాబోయే రోజుల్లో అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. త్వరలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.
సుకుమార్ రెడ్డి చేరిక నేపథ్యంలో కావలి జనసేనలో వ్యక్తమైన ఈ అసంతృప్తి పార్టీ అంతర్గత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.



