హార్దికర్ ఆశయాలే స్ఫూర్తిగా.. సేవే మా సంకల్పం
ఘనంగా డాక్టర్ ఎన్.ఎస్. హార్దికర్ వర్ధంతి వేడుకలు
కూలీలు, వృద్ధులు, వికలాంగులకు అల్పాహారం.. 300 మందికి అన్నప్రసాదం
తుర్కయంజాల్, ఆగస్టు 26:
దేశసేవ, ప్రజాసేవ, యువజన చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎన్.ఎస్. హార్దికర్ వర్ధంతిని పురస్కరించుకుని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. హార్దికర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగంగా కూలీలు, వికలాంగులు, వృద్ధులకు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు. అనంతరం సికింద్రాబాద్ చిలకలగూడ బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు, డ్రైవర్లు, మహిళలు, నిరుపేదలకు సుమారు 300 మందికి బిర్యానీ భోజన ప్రసాదాన్ని అందించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి లిక్కి వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హార్దికర్ చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడమే నిజమైన నివాళి అని అన్నారు. ప్రజాసేవే పరమ ధర్మమనే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.
హార్దికర్ ఆశయాల వెలుగులో..
ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం, వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం, కష్టజీవులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలే హార్దికర్ ఆశయాలకు నిజమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. సేవాదళ్ స్ఫూర్తితో ప్రజల మధ్య ఉంటూ సేవే శ్వాసగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
లిక్కి వెంకట్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 300 మందికి అన్నప్రసాదం అందించడం ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. హార్దికర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకువస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.





