ఆకస్మిక తనిఖీలో రికార్డులను పరిశీలించిన దాసరి భాను ప్రకాష్
సభ్యత్వం పెంపు, సెస్సు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
వేముల,
పున్నమి న్యూస్ ప్రతినిధి, ఆగస్టు 17:
వేముల మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భాను ప్రకాష్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని రికార్డులను పరిశీలించి, పాఠకులకు అందుతున్న సేవలు, సభ్యత్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయానికి మరింత మంది పాఠకులను ఆకర్షించేలా సభ్యత్వాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని గ్రంథాలయ అధికారి గంగాధర్ యాదవ్‌కు సూచించారు.
పాఠకులకు మెరుగైన సేవలు అందించేలా గ్రంథాలయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన గ్రంథాలయ సెస్సును వెంటనే వసూలు చేసి జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులకు జమ చేయాలని సూచించారు. ఇందుకోసం పంచాయతీ అధికారులను కలిసి సెస్సు బకాయిలను రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని గ్రంథాలయ అధికారికి సూచించారు.
అనంతరం పాత నిధులతో నిర్మాణంలో ఉన్న నూతన గ్రంథాలయ భవనాన్ని చైర్మన్ పరిశీలించారు. భవన నిర్మాణంలో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, నూతన భవనాన్ని త్వరలోనే పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని దాసరి భాను ప్రకాష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠకులు లక్ష్మీనారాయణ రెడ్డి, వలి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

