ఎస్టీ కాలనీలో 150 మందికి భోజన వసతి కల్పించిన కుటుంబ సభ్యులు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి)
ఆత్మకూరుకు చెందిన శ్రడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఎన్జీవో వాగాల శ్రీహరి సోదరుడు, దివంగత ప్రజా సమస్యల సాధకుడు వాగాల పుల్లయ్య గారి పెద్ద కుమారుడు వాగాల వెంకటేశ్వర్లు 8వ వర్ధంతి సందర్భంగా మంగళవారం వారి కుటుంబ సభ్యులు పట్టణంలోని ఎస్టీ కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి భోజన సదుపాయాలు కల్పించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలయ్య, న్యాయవాది నందా ఓబులేసు, బీఎస్పీ నేత కృష్ణయ్య తదితరులు హాజరై పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాగాల వెంకటేశ్వర్లు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వాగాల వెంకటేశ్వర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తిగా గుర్తు చేశారు. సమాజ సేవలో ఆయన చూపిన నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఆదర్శనీయమని కొనియాడారు.అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు కుటుంబ సభ్యులు అందించిన భోజనాన్ని స్వీకరించి, వాగాల వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ కార్యక్రమం నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎన్జీవో వాగాల శ్రీహరి మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యుడి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పిలిచిన వెంటనే కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


