-బోటుమీదపల్లిలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన – అన్నదాత సుఖీభవపై ఆరా తీసిన నాయకులు
చిట్వేల్, నవంబర్ 28: పున్నమి ప్రతినిధి
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్నా.. మీ కోసం’కార్యక్రమం రైల్వే కోడూరు నియోజకవర్గంలో చురుగ్గా సాగుతోంది. ఓబులవారిపల్లి మండలం, బోటుమీదపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా పాల్గొని రైతులకు భరోసా ఇచ్చారు.
-ఇంటింటికీ వెళ్లి పథకాల పంపిణీ
కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి రైతులతో మమేకమయ్యారు. వారు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన పాంప్లెట్లను పంపిణీ చేసి, పథకాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలబడతాం,” అని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, ఇటీవల విడుదలైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయా లేదా అని రైతులను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
-రైతుల శ్రేయస్సే లక్ష్యం
అనంతరం ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. రైతులకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు తమ సమస్యలను నేరుగా నాయకులకు వివరించి, పథకాల గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.


