పున్నమి న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 09:
వేముల గ్రామ సమాఖ్య అసిస్టెంట్ల సమీక్షలో పీడీ డీఆర్డీఏ డాక్టర్ రాజలక్ష్మి
వేముల, సెప్టెంబర్ 9: మహిళల ఆర్థిక సాధికారత సాధించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజలక్ష్మి అన్నారు. వేముల మండలంలోని శ్రీశక్తి భవన్లో నిర్వహించిన గ్రామ సమాఖ్య అసిస్టెంట్ల సమీక్ష సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రతి లావాదేవీని మొబైల్ బుక్ కీపింగ్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ‘సూపర్ నారీ–మన డబ్బులు మన లెక్కలు’ యాప్ ద్వారా సంఘాల ఆర్థిక లావాదేవీల వివరాలను మహిళలు మొబైల్లోనే తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి సంఘ సభ్యురాలికి యాప్‌పై అవగాహన కల్పించి విస్తృతంగా వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు.
మహిళల ఆదాయం పెంచడంపై దృష్టి
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి, సీఐఎఫ్ రుణాలను జీవనోపాధి కార్యక్రమాలతో అనుసంధానం చేయాలని పీడీ సూచించారు. అర్హులైన మహిళలకు సకాలంలో రుణాలు అందించి, జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసి వాటిని స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చేలా క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు.
గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేస్తూ మహిళల జీవనోపాధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని తెలిపారు.
జీవనోపాధి, పోషకాహార కార్యక్రమాలకు ప్రాధాన్యం
మండలంలో హ్యూమన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, న్యూట్రి గార్డెన్లు, కిచెన్ గార్డెన్లు, పెరటి తోటలు, కోళ్ల పెంపకం, మహిళలకు విద్య నేర్పే అక్షర ఆంధ్ర కార్యక్రమం, పాఠశాల విద్యార్థులకు భోజనం అందించే స్మార్ట్ కిచెన్ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని డాక్టర్ రాజలక్ష్మి సూచించారు.
ఈ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు మండల మహిళా సమాఖ్య సిబ్బంది, కమిటీ సభ్యులు, గ్రామస్థాయి సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
లోకోస్లో వివరాల నమోదు వేగవంతం చేయాలి
జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లావణ్య మాట్లాడుతూ గ్రామ సంఘాలు, సభ్యులు, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన వివరాలను లోకోస్ యాప్‌లో పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. సంఘాల సమాచారం సక్రమంగా నమోదు చేయడం ద్వారా DAY-NRLM నిధులను మండల మహిళా సమాఖ్య మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
సామాజిక పెట్టుబడి నిధి, స్త్రీనిధి రుణాల చెల్లింపులను 100 శాతం ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ విధానంలో నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏపీఎం ఆంజనేయులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జ్యోతి, జైపాల్, హరికృష్ణ, గంగరాజు, నాగేశ్వరి, మండల సమాఖ్య అకౌంటెంట్ చిన్నరెడ్డి, స్వాతితో పాటు మండలంలోని గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు పాల్గొన్నారు.


