
భీమవరంలోని ఆక్వా ప్రొడక్ట్ ఫ్యాక్టరీలో జరిగిన విషాదకర ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఫ్యాక్టరీలో డ్రైనేజీ శుభ్రపరిచే పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, 2024 భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని ఈ ఘటనపై స్పందించారు. ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకు పూర్తి న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.

