ఆత్మగౌరవం కోసం దళితుల గర్జన.. డప్పులతో రోడ్డెక్కిన బాధితులు
చిన్నారులతో కలిసి బైఠాయింపు.. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలకు డిమాండ్
బంబారా, జూలై 31 (పున్నమి ప్రతినిధి):
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణల ఆరోపణలు కలకలం రేపాయి. తమను కులం పేరుతో అవమానిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ దళితులు భారీ ఆందోళనకు దిగారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులు వాయిస్తూ నిరసన తెలిపారు.
‘‘కుల వివక్షకు తావులేదు.. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి’’ అంటూ నినాదాలతో గ్రామంలో నిరసన హోరెత్తించారు. కుల దూషణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితుల ఆరోపణల ప్రకారం.. కొంతకాలంగా తమను కులం పేరుతో అవమానిస్తూ వేధిస్తున్నారని, పలుమార్లు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. దీంతో న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పొన్నాల నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, కుల వివక్షకు చోటు లేకుండా అధికారులు నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
చిన్నారులతో బైఠాయింపు:
ఆందోళనలో మహిళలు చిన్నారులతో కలిసి రోడ్డుపై బైఠాయించడం చర్చనీయాంశమైంది. తమ కుటుంబాలు భయాందోళనల్లో ఉన్నాయని, కులం పేరుతో అవమానాలకు గురికావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సూచిస్తూ, బాధితుల ఫిర్యాదు ఆధారంగా చట్టప్రకారం విచారణ చేపడతామని తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వాస్తవాలు వెలుగులోకి రావాలి:
కుల దూషణల ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో విచారణ పూర్తయ్యే వరకు వదంతులకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం బంబారా గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, పోలీసుల తదుపరి చర్యలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.




