ఫార్మా సిటీ రద్దు చేయాలి – రైతుల భూములను కాపాడాలి
మేడిపల్లి గ్రామంలో రైతులు, రైతు కూలీల సమావేశం
పున్నమి న్యూస్ ప్రతినిధి
21 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
మేడిపల్లి గ్రామంలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామ రైతులు, రైతు కూలీల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి తెస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రైతులు మాట్లాడుతూ కోర్టు స్టే ఉన్న పట్టా భూముల్లో కూడా అధికారులు యంత్రాలు తీసుకువచ్చి భూములను చదును చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతు కుంరెడ్డి యాదవ్ రెడ్డి భూమిలో పనులు ప్రారంభించగా గ్రామ రైతులు, ప్రజలు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. చట్టపరంగా స్టే ఉన్న భూముల్లో కూడా అధికారులు బలవంతంగా పనులు చేయడం అన్యాయమని మండిపడ్డారు.
రైతు కూలీలు మాట్లాడుతూ భూములు కోల్పోతే తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని వాపోయారు. ఇప్పటికే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, మొత్తం భూములు పోతే తమ జీవనం ఎలా సాగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ చట్ట వ్యతిరేక చర్యలను నిలిపివేసి రైతుల భూములను రక్షించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో పాల్గొన్న రైతులు, కూలీలు పెద్ద ఎత్తున “ఫార్మా జి.ఓ రద్దు చేయాలి”, “మాకు మా భూములు కావాలి”, “రైతులపై వేధింపులు ఆపాలి” అంటూ నినాదాలు చేశారు. రాబోయే పోరాట కార్యక్రమాల్లో ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కల్లు కొండల్ రెడ్డి, పాండురంగచారి, అచ్చిరెడ్డి, కనేమోని గణేష్, గడ్డం కుమార్, ఆరెపల్లి లింగం, వెంకటేశం గౌడ్, బొగ్గుల పాపిరెడ్డి, మహిపాల్ రెడ్డి, గడ్డం రవీందర్, జోగు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.



