విజయవాడ పున్నమి ప్రతినిధి సురేష్
జనసేన పార్టీపై, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై, మంత్రి నాదెండ్ల మనోహర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై పార్టీ పీఏసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ అశోక్, నెరుసు కృష్ణాంజనేయులు, రుద్ర శేఖర్ నాయుడు, మద్దిల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు వారు మీడియాతో మాట్లాడారు. మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిగజారి జనసేన పార్టీపై అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీకి పూర్తి అనుకూలంగా మాట్లాడుతూ అది తన విశ్లేషణ అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు సంపాదించి, కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి సుమారు 16 నెలలు పైగా జైల్లో ఉన్న వ్యక్తికి అనుకూలంగా మాట్లాడటంలో ఆంతర్యం ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయంగా, ప్రజాసేవలో ముందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నారు.
జనసేన పార్టీపై, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై, మంత్రి నాదెండ్ల మనోహర్ పై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు అన్న విషయాన్ని మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖకు దేశంలోనే అత్యధికంగా 13 అవార్డులు అందుకున్నాయనీ గుర్తు చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకువచ్చి గ్రామాలలో మంచినీటి వసతులు కల్పించి ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా నిలిచారన్నారు.
గిరిజన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, కూడా మౌలిక వసతులు కూడా కల్పించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దక్కిందని తెలిపారు.
హైదరాబాదులో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై విశ్లేషణ చేస్తున్నానని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. రోజురోజుకి రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ప్రజాదారణ చూడలేకే ఒక వర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పేటీఎం బ్యాచ్ తో కలిసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేస్తున్న అసత్య ఆరోపణలను రాష్ట్ర ప్రజలే ఖండిస్తున్నారని పేర్కొన్నారు. నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలి అనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. అటువంటి వ్యక్తిపై నిరాధారంగా చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన విధ్వంసాలు, ప్రస్తుతం కుటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదా అని ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోతిరెడ్డి రమణ, 63వ డివిజన్ జనసేన అధ్యక్షులు చిగుళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.



