40 మంది లబ్ధిదారులకు రూ.23.63 లక్షల ఆర్థిక సాయం
అనపర్తి, ఆగస్టు 9 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) పేద, మధ్యతరగతి కుటుంబాలకు వరంలా మారిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది లబ్ధిదారులకు వైద్య సహాయం నిమిత్తం రూ.23,63,164 విలువైన చెక్కులు, ఎల్‌ఓసీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఇప్పటివరకు అనపర్తి నియోజకవర్గంలో 425 మంది లబ్ధిదారులకు రూ.4.03 కోట్ల మేర సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి రాని పేదలకు కూడా వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా విస్తృతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



