పుల్లంపేటలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా
పుల్లంపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్ఐ వి. చిన్న రెడ్డెప్ప ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. అనంతసముద్రం, వడ్డుపల్లి, అగ్రహారం గ్రామాలతో పాటు శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను డ్రోన్ల ద్వారా పరిశీలించారు. పేకాట స్థావరాలు, కోళ్ల పందేలు, గంజాయి నిల్వలు, వినియోగం, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణ నిఘాకు అందని ప్రాంతాల్లోనూ డ్రోన్ల సహాయంతో అనుమానాస్పద కదలికలను గుర్తించి, అవసరమైనప్పుడు వెంటనే పోలీసు సిబ్బంది స్పందించేలా చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కదలికలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, సమాచారాన్ని అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవసరాన్ని బట్టి మండలంలోని ఇతర గ్రామాల్లోనూ డ్రోన్ నిఘాను విస్తరిస్తామని కోడూరు రూరల్ సీఐ పేర్కొన్నారు.






