విధి నిర్వహణలో మృతి చెందిన శానిటరీ వర్కర్ కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం అండ – భార్య కామేశ్వరికి చెక్కు అందజేసిన మంత్రి ఆనం
ఆత్మకూరు, మే 22 (హరికిరణ్ ,పున్నమి ప్రతినిధి):
విధి నిర్వహణలో మృతి చెందిన ఆత్మకూరు మున్సిపాలిటీ శానిటరీ వర్కర్ చిచ్చు మల్లికార్జునరావు కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో మృతుని భార్య కామేశ్వరికి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విధి నిర్వహణలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి దాదాపు రూ.73 లక్షల మేర ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందన్నారు.ఆత్మకూరు మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి రూ.5 లక్షలు మృతుని భార్య కామేశ్వరికి అందిస్తున్నట్లు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా పిల్లల చదువుల కోసం రూ.8 లక్షలు, మరో రూ.20 లక్షల ఇన్సూరెన్స్ నగదు అందనున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ ఉండటంతో మరో రూ.35 లక్షలు బీమా రూపంలో లభించనున్నాయని చెప్పారు.అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండటంతో పార్టీ తరఫున మరో రూ.5 లక్షల సహాయం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయానికి ఈ సంఘటన నిదర్శనమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పిల్లల చదువులకు పూర్తి భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్ , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరి నాయుడు ,ఆనం లీలా కైవల్య రెడ్డి, పట్టనాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


