పున్నమి: హైదరాబాద్, జూలై 31, 2026
తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
డాక్టర్ బి.ఆర్.కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల & ఆసుపత్రి, ఎర్రగడ్డ, హైదరాబాద్‌కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) విద్యార్థులు, హౌస్ సర్జన్లు (ఇంటర్న్స్), పీజీ విద్యార్థులు నేడు నల్ల రిబ్బన్లు ధరించి కళాశాల, ఆసుపత్రి ప్రాంగణం ముందు ఒక గంట పాటు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
స్టైపెండ్ పెంపు కోసం గత 15 రోజుల క్రితం నిరవధిక సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు.
గత పదేళ్లుగా ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్లు పెంపు అంశంపై వందలాది వినతిపత్రాలు, ప్రాతినిధ్యాలు, అధికారులతో సమావేశాలు జరిగినప్పటికీ ఇప్పటివరకు సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌ను వెంటనే పరిష్కరించకపోతే, ఆగస్టు 4, 2026 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభమవుతుందని. అప్పటి వరకు అన్ని తరగతులు, వైద్య విధులకు హాజరవుతూ నల్ల రిబ్బన్లు ధరించి నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆయుష్ హెచ్ఎస్ అండ్ పీజీ-జేఏసీ అధ్యక్షుడు డా. బి. రాజేష్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్లు దాదాపు పదేళ్లుగా పెరగలేదని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు తెలంగాణతో పోలిస్తే రెండింతలకు పైగా స్టైపెండ్ అందిస్తున్నారని, అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయుష్ విద్యార్థుల పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో డా. బి. రాజేష్ కళ్యాణ్ (అధ్యక్షుడు), డా. అఖిల్ కుమార్, డా. మసీహా, డా. సంతోష్, డా. సాయి దేవ్, డా. విఘ్నేష్, డా. ఉమేష్, డా. బిందు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
చివరగా, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్ పెంపు సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే నిరవధిక సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది.
తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఆయుష్ హెచ్ఎస్ అండ్ పీజీ-జేఏసీ).



