వర్షాలు రాబోతున్నాయి ఈ వర్షాలలో డెంగ్యూ జ్వరానికి కారణమైన ఎడిస్ ఈజిప్ట్ దోమలు విపరీతంగా పెరగబోతున్నాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా రాబోతున్నాయి. ఈ డెంగ్యూ జ్వరం దోమలు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం
1. చాలా మంచి దోమ:
మన నిద్రకు ఇబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు. ఉదయం 5 నుండి 8 గంటల మధ్య, అలాగే సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్య కుట్టడం దీనికి చాలా ఇష్టం.
2. శుభ్రమైన దోమ:
ఇది బాగా శుభ్రమైన నీటిలోనే (మంచి నీటిలోనే) గుడ్లు పెడుతుంది. మురికి నీళ్ల జోలికి అస్సలు పోదు. ఇళ్లలోని పూల కుండీలు, కూలర్లు, పాత టైర్లు, నిల్వ ఉన్న నీటి పాత్రలే దీనికి అడ్డా.
3. మొద్దు దోమ:
ఇది ఎక్కువ ఎత్తు ఎగరలేదు (గరిష్టంగా 3 నుండి 4 అడుగులు మాత్రమే). అందుకే మోకాళ్ల కిందే ఎక్కువగా కుడుతుంది. ఇది ఊరంతా తిరగలేదు, మనం వాహనాల్లో లేదా బట్టల్లో తీసుకెళ్తే తప్ప ఇంకో ఊరికి పోలేదు.
4. బ్రతక నేర్చిన దోమ:
సాధారణంగా వారం-పది రోజుల్లో గుడ్డు నుండి పిల్ల దోమ బయటకు వస్తుంది. కానీ ఒకవేళ నీరు లేక ఎండిపోతే.. ఆ గుడ్డు సంవత్సరం పాటు సజీవంగా చావకుండా ఉండగలదు! మళ్లీ కాస్త నీటి తడి తగలగానే బయటకు వచ్చి డెంగ్యూ వ్యాపింపజేస్తుంది.
5. తెలివైన దోమ:
మనం ఎక్కడ బట్టలు సరిగా వేసుకోమో చూసి.. ముఖ్యంగా కాళ్లు, పాదాలు, మోకాళ్ల కింద, మోచేతుల కిందే ఎక్కువగా కుడుతుంది.
6. మనుషులంటే ప్రేమెక్కువ:
దీనికి మనిషి రక్తం అంటేనే చాలా ఇష్టం. జంతువులను, పశువులను ఇది పెద్దగా కుట్టదు.
7. టైగర్ దోమ:
ఇది చూడటానికి కాస్త నల్లగా, వంటిమీద పులి చారల లాగా నలుపు-తెలుపు పట్టీలు ఉంటాయి. అందుకే దీనిని “టైగర్ మస్కిటో” అంటారు.
8. ఆడ దోమ మాత్రమే కుడుతుంది:
ఆడ దోమ మాత్రమే మనుషులను కుడుతుంది (గుడ్లు పెట్టడానికి రక్తం అవసరం కాబట్టి). కానీ కుట్టేటప్పుడు మాత్రం మగ, ఆడ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ సమానంగా కుడుతుంది! (మగ దోమలు కేవలం మొక్కల రసాలు మాత్రమే తాగుతాయి).
9. సైలెంట్ దోమ:
ఇతర దోమల్లాగా ఇది చెవి దగ్గర “యూన్” అని శబ్దం చేయదు. చాలా నిశ్శబ్దంగా వచ్చి కుడుతుంది. అంతేకాకుండా, ఒకేసారి కడుపు నింపుకోకుండా కొద్ది కొద్దిగా ఒకే సమయంలో నలుగురైదుగురిని కుట్టే స్వభావం దీనికి ఉంది.
ఈ పాడు దోమ చేత కుట్టించుకోకుండా జాగ్రత్త పడదాం.. డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం.
డాక్టర్ ఎం. వి. రమణయ్య
రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక
రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.


