డాగ్స్ స్టెరిలైజేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్
రికార్డులు, ఆపరేషన్ల వివరాలపై ఆరా.. వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
పున్నమి ప్రతినిధి, కడప, సెప్టెంబర్ 5:
కడప నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి. భవానీ ప్రసాద్ శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని డాగ్స్ స్టెరిలైజేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించిన కమిషనర్.. కుక్కలకు నిర్వహిస్తున్న ఆపరేషన్లు, స్టెరిలైజేషన్‌కు సంబంధించిన కౌంట్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన స్టెరిలైజేషన్ల సంఖ్య, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర వివరాలు సేకరించారు.
అనంతరం మలేరియా విభాగం అధికారులతో స్టెరిలైజేషన్ ప్రక్రియ, వీధి కుక్కల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
స్టెరిలైజేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రక్రియకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
నగరంలో వీధి కుక్కల నియంత్రణకు మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.



