జోగవానిపాలెంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్ర – ప్రజా సమస్యలపై మండిపడిన ప్రజలు
విశాఖపట్నం, – పున్నమి ప్రతినిధి
విశాఖపట్నం నగరంలోని జోగవానిపాలెం 67వ వార్డులో, సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హై స్కూల్ రోడ్ విద్యుత్ సబ్‌స్టేషన్ పశ్చిమ భాగం మరియు బొజ్జనకొండ తూర్పు భాగాల్లో పార్టీ నాయకులు పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
ఈ యాత్రలో ఎక్కువగా స్లమ్ ప్రాంతాలు కేంద్రంగా ఉండగా, ప్రజలు ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలు విఫలమవుతోందని, నిత్యవసర సరుకుల ధరలు భరించలేని స్థాయికి చేరాయని, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లలో మూడు మాత్రమే వస్తున్నాయని, బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ కూడా రావడంలేదని తెలిపారు.
ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇళ్ల కోసం ప్రజల నుంచి రూ.10,000 నుంచి రూ.1,20,000 వరకు వసూలు చేసినా, ఇప్పటికీ వారికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలను చూపించకపోవడం బాధాకరమని వారు వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నిత్యవసర ధరల నియంత్రణలో విఫలమైందని, ప్రజలు తమ నమ్మకాన్ని కోల్పోతున్నారని గట్టిగా తెలిపారు.
విద్యా రంగంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, RTE చట్టం ప్రకారం (12(1)(c)) ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ ఫండ్లు రాకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. అదే విధంగా, అమ్మకు వందనం స్కీం అమలులో లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వల్ల ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ నాయకులు కామ్రేడ్ కిరీటం, కె. ప్రతాప్ కుమార్, కె. సంతోషం, కళ్యాణి, కృష్ణ కుమారి, గాజువాక జోన్ సభ్యులు లోకేష్, శ్రీనివాస్ గార్లు పాల్గొన్నారు. సమావేశానికి వార్డు శాఖ కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణ స్వామి పాలూరు అధ్యక్షత వహించారు.
ఈ యాత్ర ద్వారా సిపిఎం పార్టీ ప్రజల అభిప్రాయాలను సేకరించి, సంబంధిత అధికారులకు వినిపించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని నాయకులు హామీ ఇచ్చారు.