రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, ప్రతి మండపం వద్ద భద్రతను పర్యవేక్షించాలని సూచించారు.
నిమజ్జన మార్గాలు, ప్రదేశాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో తగినంత బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలన్నారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దం, రెచ్చగొట్టే నినాదాలు, మద్యం సేవించి పాల్గొనడంపై నిఘా ఉంచాలని సూచించారు.
అలాగే రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిపై ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని కోరారు.



