రోడ్డు విస్తరణ పేరిట హనుమాన్ ఆలయానికి ముప్పు..? అధికారుల తీరుపై భక్తుల ఆందోళన
యాచారం: భారత్ ఫ్యూచర్ సిటీ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతుండడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, పూర్తాణ హనుమాన్ దేవాలయం వద్ద చేపడుతున్న రోడ్డు విస్తరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయ ప్రహరీ గోడను తొలగించి, మూలవిరాట్ (విగ్రహం) వరకు మట్టి పోసి రహదారి పనులు చేపట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే ఆర్డీఓకు వినతిపత్రం అందజేసినా స్పందన లేదని స్థానికులు తెలిపారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ వెంటనే స్పందించి ఆలయానికి దూరంగా రహదారి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, మూలవిరాట్ వరకు పోసిన మట్టిని వెంటనే తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ప్రజలకు, రైతులకు ప్రభుత్వ భూమినే సేకరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు పట్టా భూములతో పాటు దేవాలయం వరకు రోడ్డు పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నేడు దేవాలయం వరకు వచ్చిన రహదారి విస్తరణ, రేపు గ్రామానికే ముప్పుగా మారుతుందేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవాలయ పవిత్రతను కాపాడుతూ ప్రజల మనోభావాలను గౌరవించేలా అధికారులు తక్షణమే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.




