తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, మే 28:
ఎన్టీఆర్ ఆశయాలతో గ్రామాభివృద్ధికి కృషి : నామా సురేంద్ర కుమార్
తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ యువ నాయకులు నామా సురేంద్ర కుమార్, సిద్ధన రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నామా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానుభావుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసిన నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని తెలిపారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ సామాన్య ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని అన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో సొసైటీ అధ్యక్షులు నామా వెంకటసుబ్బారావు (కొండబాబు) ఆధ్వర్యంలో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి సత్యనారాయణ, చింతపల్లి బుజియ్య, రంగయ్య, అయ్యప్పతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Uploaded Video:


