పున్నమి ప్రతినిధి,తిరుపతి,
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
సోమవారం ఉదయం తిరుపతి పట్టణంలోని ముత్యాలరెడ్డి పల్లిలో గల దుర్గా నగర్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.., సామాజిక భద్రత కల్పించే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కలిగిన సంక్షేమ పథకాలలో ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా, పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క జిల్లాకే నెలకు సుమారు రూ.120 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాలలో ఒకటని పేర్కొన్నారు.
జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో సామాజిక భద్రతా పెన్షన్లను రూ.3,000 నుండి రూ.4,000కు పెంచినట్లు తెలిపారు.
తిరుపతి నియోజకవర్గంలో 18,303 మంది లబ్ధిదారులకు వివిధ కేటగిరీల కింద ప్రతి నెలా రూ.8 కోట్ల 19 లక్షల మేర పెన్షన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమమని అన్నారు.
లబ్ధిదారులందరూ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా ఇంటి వద్దకే పెన్షన్లు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో క్లీన్ అండ్ బ్యూటీఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ శారదా దేవి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




