*హాజరైన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు*
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 4:
జగ్గంపేట మండలం ఇర్రిపాక శివకేశవుల క్షేత్రంలో అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణుడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణెమ్మ దంపతులు పీటలపై కూర్చుని ఈ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 40 లక్షల రూపాయలు అష్టలక్ష్మి గుడికి, అదేవిధంగా రేపు అయోధ్య రామ మందిరం పోలిన రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నామని ఆ రామాలయానికి 40 లక్షలు అందించడం జరిగిందని ఈ రెండు దేవాలయాలను భక్తుల సహకారంతో అత్యంత సుందరంగా నిర్మిస్తామని అన్నారు.ఇర్రిపాక క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అష్టలక్ష్మి ఆలయంతో క్షేత్రానికి మరింత విశిష్టత వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


