ఖమ్మం ఆగష్టు 9
(పున్నమి న్యూస్)
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేసిన విద్యా ప్రదాత, నిర్మల్ హృదయ్ విద్యా సంస్థల అధినేత వంగ సాంబ శివ రెడ్డి ఇక లేరు. ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు.
విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాంబ శివ రెడ్డి.. తన చుట్టుపక్కల వారితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ, ప్రతి ఒక్కరికీ ఆప్యాయంగా పలకరిస్తూ, అవసరమైన వారికి సలహాలు, సూచనలు అందించేవారు. “అందరూ బాగుండాలి.. అందులో నేను ఉండాలి” అనే భావంతో జీవించిన ఆయన ఎందరో అభిమానులను, ఆత్మీయులను సంపాదించుకున్నారు.
ఆయన అంతిమయాత్ర ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. తమ గురువును, ఆత్మీయుడిని, అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, అభిమానుల కళ్లల్లో కన్నీళ్లు కనిపించాయి.
“అందరికీ మంచి చేసిన మహానుభావుడు సాంబ శివ రెడ్డి” అంటూ పలువురు ఆయన సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు. ఆయన మృతి విద్యారంగానికి, ఖమ్మం నగరానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ విద్యా దీపం ఇక ఆరిపోయింది.
అభిమానులకు, స్నేహితులకు, ఆత్మీయులకు “ఇక సెలవు” అంటూ… సాంబ శివ రెడ్డి కానరాని లోకాలకు వెళ్లిపోయారు.



