పరిశీలనఆర్ & బి రహదారి మరమ్మతులకు రూ.30 లక్షల నిధులు మంజూరు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరుపాలెం సెంటర్ నుంచి పట్టణంలోకి వెళ్లే ఆర్ & బి రహదారి మరమ్మతులకు రూ.30 లక్షల నిధులు మంజూరు చేస్తూ వెంటనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం ఉదయం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆత్మకూరులో పలు ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరుపాలెం సెంటర్ నుంచి పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిన్న పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే స్పందించారు.రోడ్డు మరమ్మత్తు పనులను తక్షణమే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆర్ & బి శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని హెచ్చరిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.రోడ్డు మొత్తం ఆధునికీకరణ చేపట్టి చిన్న గుంత కూడా లేకుండా పనులు పూర్తి చేయాలని మంత్రి ఆనం అధికారులకు తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా రహదారి పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.అదేవిధంగా సెంటర్ లైటింగ్, గ్రీనరీ నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులకు మంత్రి సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పట్టణ అభివృద్ధిలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.


