తిరుచానూరు, ఆగస్టు 01 (పున్నమి ప్రతినిధి)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ఆగస్టు నెల పొడవునా పలు విశేష ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో కోరారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 7, 14, 28 తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథోత్సవం నిర్వహించనుండగా, ఆగస్టు 25న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు గజవాహనంపై అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ బలరామకృష్ణ స్వామివారి ఆలయంలో ఆగస్టు 8న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయంలో ఆగస్టు 3, 30 తేదీల్లో ఉత్తరభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆగస్టు 17న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 4న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ, ఆగస్టు 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం, ఆగస్టు 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం, ఆగస్టు 26న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం జరగనుంది.

